Wednesday, July 9, 2014

|| పయనం ....నాలోకి ||
నాలుగు ఒంటరి క్షణాలు 
వద్దకొచ్చి నిలబడితే చాలు 
అసంకల్పితంగానే 
నాలోకి నేను జొరబడిపోతాను 
గతం కాలిబాటలో
జ్ఞాపకాలను పరుచుకుంటూ 
పరిచయమున్న పరిసరాలలో 
అనుభూతులను వెతుక్కుంటూ 
ఒంటరిగా సాగిపోతుంటాను
అక్కడే తచ్చాడుతుంటాయేమో
కొన్ని సందర్భాలు 
ఆత్రంగా ఎగబడుతూ చుట్టుముడతాయి 
ముఖంలో ముఖంపెట్టి మరీ పలకరిస్తాయి 
కొన్నేమో తమకి ఇవేమీ పట్టనట్టు 
ముఖం తిప్పుకుని మరీ దూరంగా జరిగిపోతాయి
జీవితంలో గెలిచిన క్షణాలు కృతజ్ఞత చూపుతుంటే 
ఓడిన క్షణాలు గుర్రుగా గుడ్లురుముతాయ్
దాంపత్యం , యవ్వనం , బాల్యం 
ఒకదానితర్వాతొకటి దాటుకుంటూ పోతుంటానా 
ఆయాదశల్లోని కొన్ని సంఘటనలు 
స్మృతుల చిత్రపటాల్ని తీసుకొచ్చి 
బహుమతులుగా ఇచ్చిపోతుంటాయి 
ఇంతలో హఠాత్తుగా ..ముందంతా శూన్యం 
ఉన్నపళంగా నా పయనం ఆగిపోతుంది 
నాకిక ముందుకి ప్రవేశం లేదన్నట్టు 
అంతేగా మరి …..
మొదలూ చివరా దేవునివేగా !
మధ్యలోనేగా మన నాటకాలన్నీ ...!!

Thursday, June 26, 2014

||క్రొత్త రేపు ..||

వాస్తవం ఒప్పుకోవాలంటే …
పైకి కనిపించేంత అందం లేదేమో .. మన ముఖాల్లో !
అవమానపు ఆమ్లం చింది మాడిపోయినప్పుడో 
పౌరుషాల ఎండకాసి కంది పోయినప్పుడో 
కష్టాల అలలు తాకి కోసుకు పోయిన్నప్పుడో 
అంతర్ముఖం తన సౌందర్యాన్ని కోల్పోయేవుంటుంది !

నిజం చెప్పాలంటే ….
వినబడేంత తియ్యదనం లేదేమో … మన స్వరాల్లో?
ఉద్వేగం వరదల్లో తడిసి వణుకుతున్నప్పుడో
ఆవేశం లావాలు ప్రవహించి పూడుకుపోయినప్పుడో
అహం అడ్డుగోడలు కట్టుకుని ఆగిపోయినప్పుడో
లోపలి స్వరం తన కమ్మదన్నాని కోల్పోయేవుంటుంది !

యథార్ధం మాట్లాడాలంటే …
చెప్పుకునేంత గొప్పదనం లేదేమో .. ఎవరి గతాల్లో ?
కష్టసుఖాల బండి హటాత్తుగా తిరగబడ్డప్పుడో
ఎత్తు పల్లాల జీవితాన్ని ఎక్కిదిగలేక చతికిలపడ్డప్పుడో
కలసిరాని కాలాన్ని దారికి తేలేక కలవరపడ్డప్పుడో
స్వగతం తన ఘనతని కోల్పోయేవుంటుంది !

అయినా … మనం
నవ్వుల్ని పూయిస్తూనే ఉదయిస్తుంటాం
స్వచ్చతను కోల్పోకుండానే పరిమళిస్తుంటాం
విశ్వాసాన్ని పరుచుకుంటూనే అడుగేస్తుంటాం
నిన్న మనతో కలిసి రాకుంటే ఒంటరిమై ఓడిపోతామా?
కూడబెట్టిన ఆత్మవిశ్వాసాన్ని పోతపోసి
కొత్త రేపటిని తయారు చెయ్యకుంటామా ?!!

http://www.andhraprabha.com/literature/poem/a-poem-by-prasad-atluri/19102.html

Friday, May 23, 2014

||తరగని దూరం||

పెద్దచెఱువు గట్టున చింతచెట్టుపై 
చిన్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆడుతుంటే 
దొంగ పెట్టాల్సొస్తుందన్న అక్కసుతో 
చెయ్యితగిల్నా తగల్లేదన్న చిన్నఅబద్దం
ముప్పైఏళ్ళయినా దగ్గరకాలేని దూరాలకు 
మనిద్దరినీ విసరబోతోందని ఆక్షణం తెలిసుంటే 
ఒకరికోసం ఇంకొకరు మళ్ళీ దొంగమయ్యేవాళ్ళమేమో !!

అయినా ..ఎన్నిసార్లు ప్రయత్నించలేదు మనం 
ఒకరికొకరం దగ్గరవ్వాలని ఆ తరువాత ...
గోలీలాటలో నాకోసం నువ్వు ఓడిపోతూ 
గోడుంబిళ్ళ క్యాచ్ నీకోసం నేనొదిలేస్తూ 
పంటలేయడానికి చేతులు పట్టుకున్నప్పుడు 
అవకాశాన్ని వదలకుండా ఎంతసేపు వుండిపోలేదలా ...
కానీ ఎందుకనో.. ఓ సన్నని తెర మనల్నివేరుచేస్తుండేది !! 

బ్రుతుకు బాటలు మనల్ని చెరోవైపుకు చేర్చాక 
మాటలు రాని పెళ్లి సుభలేఖల్ని మాత్రం 
ఒకరికొకరం పోస్టుచేసుకుని మురిసిపోయామే ..
చొరవతీసుకుని ఎవ్వరమైనా ఒక్క ఫోన్ చేసుంటే 
దూరమైన పలకరింపు.. దగ్గరై ఆశ్వీరదించకుండేదా 
పారేసుకున్న మధుర క్షణాల్ని కానుకివ్వకుండా ఉండేదా ? 
మరెందుకో అలాజరగలేదు ... అప్పుడు కూడా!!!!

యంత్రాల మధ్య యాంత్రికమైపోయిన జీవితంలో 
తలపైకెత్తి చుక్కల్ని చూసే వీలుచిక్కినప్పుడల్లా 
నువ్వెక్కడో తలుక్కున మెరుస్తూనే ఉంటావ్ ... నేస్తం 
ఆరుబయట ఆటల్లో పిల్లలు గొడవపడుతుంటే 
దగ్గరకుపిలిచి సర్దిచెబుతున్నప్పుడల్లా ఎవరో కుర్రాడు 
బుంగమూతి పెట్టుకుని రుసరుసలాడుతూ వెళుతుంటే 
నిన్నునేనో నన్నునువ్వో వదిలేసి వెలుతున్నట్లేవుంటుంది దోస్త్ !! 

చిన్నతప్పుకు మనం అనుభవిస్తున్న ఇంత పెద్దశిక్ష
ఏ న్యాయస్థానమూ ఖరారు చేసింది కాదుగా...
మరెందుకింకా అహం జైళ్ళలోనే మగ్గిపోవటం!!! 
ప్రక్కవాడికి చెయ్యితగిలితేనే పదిసార్లు సారీ చెప్తామే 
ప్రాణస్నేహితుడికి చెయ్యందించి చేరువ కాలేమా 
వస్తున్నానేస్తం .. వదిలిన చోటుకే మళ్ళీ 
తరగని దూరాన్ని .. దగ్గర చేసుకుందామని !!

)-బాణం-> 22MAY14

Tuesday, April 22, 2014

||ఓటు ..||
కులమతాల కార్చిచ్చులో 
జనారణ్యాలను తగలబెడుతుంటే 
కన్నీటితో ఆర్పలేక కుమిలిపోయావే 
నిత్యావసర ధరలు నింగికెగిరిపోతే 

నిస్సహాయుడవై నేలచూపులు చూశావే
బంధాలను బలవంతంగా తెంచుతుంటే
బలవంతుడివైపు బేలగా చూశావే
తీరా వెయ్యిగొడ్లను తిన్న రాబందులు
వాకిట్లో కొచ్చి నిలబడితే
ఓటు బాణమేసి సంహరించకుండా
నాకెందుకనుకుని నీళ్ళునములుతావే
తీరిక ఎక్కడుందని కాళ్ళు బార్లాజాపుతావే!!

మొదటాట సినిమాకైతే ముందుంటావు
ఓటెయ్యడానికైతే వెనకెనకకు పోతావే
రెండు టీషర్టులు కొనడానికి
రోజంతా మాల్సువెంట తిరుగుతావు
అరగంట వెచ్చించి ఓటేసి రాలేవా
రాత్రి రాత్రంగా పబ్బుల్లో పొర్లుతావు
గంటలు గంటలు సెల్లులో సొల్లుకొడతావు
అయిదేళ్ళకోసారి ఓటేయమంటే కుదరలేదంటావే!!
భవితను బ్రతికించుకోలేని బద్దకం నీకెందుకు
సమర్థుడిని ఎన్నుకోలేని బాధ్యతా రాహిత్యమెందుకు
అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నీ చేతు(త)లతోనే చంపేస్తావా
లే యువతా లే .. ఓటేసి.. ఓడిపోతున్నదేశాన్నిగెలిపించు !!

)-బాణం-> 23APR14

Sunday, April 6, 2014

|| ఎలా ....||


పువ్వుల్లో మకరందాల్ని నవ్వుల్లోకి
వెన్నెల వెలుగుల్ని కళ్ళల్లోకి నింపుకొస్తే
నీ పరిచయం శాశ్వతమని మురిసిపోయా 
నీ ప్రేమ నిజమనుకుని గుండెకు అప్పజెప్పా


హృదయాంతరాళలోకి వేళ్ళూనుకున్నావనీ
మనసు తోటలో వసంతమై విరబూస్తావని అనుకుంటే
శిశిరమైనా రాకముందే చిరురించిన ఆశల్ని రాల్చేసి
కళ్ళముందే ప్రేమవృక్షాన్ని కూల్చేసి వెళ్లిపోయావ్

నువ్వున్నప్పుడు క్షణమై కరిగిన కాలం
లేనప్పుడు యుగమై గడ్డ కట్టుకుపోయింది
నువ్వున్నప్పుడు నీడలా వెంటవచ్చిన ఆనందం
లేనప్పుడు ఎదురుపడినా తలత్రిప్పుకు వెళ్ళిపోతోంది

మర్మం తెలియని మదికి ఇవన్నీ చెప్పేదెలా
నువ్వేనిండిన తననుండి నిన్ను వేరుచేసేదెలా
మారాంచేసే మనసుతో మాటలెలా కలిపేది
ఊరుకోని హృదయాన ఊరడింపునెలా నింపేది ?!!
)-బాణం-> 07apr14